నర్సంపేటలో అవినీతి రాజ్యం!
అధికారం ముసుగులో అక్రమ దందాలు
ఎమ్మెల్యే–అధికారులు కుమ్మక్కై ..ప్రభుత్వ పథకాలకూ గండి
కాంగ్రెస్ నాయకుల అవినీతి తెలంగాణలోనే నంబర్ వన్
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కోట్ల దండుకుంటున్నారు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని వెల్లడి
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అవినీతి తెలంగాణలోనే అగ్రస్థానంలో ఉందని, అధికార పార్టీ నేతలతో పాటు పలు శాఖల అధికారులు చేతులు కలిపి అక్రమ దందాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నర్సంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, అధికార యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని, ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మట్టిదందా సాగించారని ఆరోపించారు. ఈ అక్రమాలన్నీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, సంబంధిత అధికారుల మధ్య ఒప్పందాల ఫలితమేనని పేర్కొన్నారు.
మట్టి దందాకు శాఖలన్నీ భాగస్వాములే!
కాంగ్రెస్ నాయకులు, పోలీసులు, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్, మైనింగ్, ఐటిడిఎ అధికారులు కలిసి నర్సంపేటలో మట్టిదందా సాగిస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలను శాటిలైట్ చిత్రాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ సేకరించిందని తెలిపారు. ఈ అంశంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టిన కాంగ్రెస్ నాయకులు, అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
రాజుపేట ఏజెన్సీలో యథేచ్ఛ మైనింగ్
నర్సంపేట మండలం రాజుపేట ఏజెన్సీ శివారులోని ముత్యాలమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టిని తవ్వి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అండతో, పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారుల సహకారంతో ఈ మైనింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని తెలిపారు. మున్సిపాలిటీ, మైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయని, రాత్రంతా వందల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. పిసాచట్టం, వన్ ఆఫ్ సెవెన్ టీ వంటి చట్టాలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతలు అక్రమాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
బెదిరింపులు, దాడులు.. మహిళలపైనా హింస
ఒకే సిండికేట్ ద్వారా మైనింగ్ జరగాలని చెప్పి మిగతావారిని బెదిరించడం, దాడులు చేయడం, మహిళలను కొట్టడం, దూషించడం జరుగుతోందని తెలిపారు. పోలీసులే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దామెర చెరువులో లోతుగా మట్టి తవ్వడం వల్ల ఊటలు వచ్చాయని, భవిష్యత్తులో మెడికల్ కళాశాలకు ప్రమాదం ఉందని ఎన్ఐఏ అధికారులు చెప్పినా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. నిబంధనల ప్రకారం ఎంత లోతు, ఎంత వెడల్పులో మట్టి తవ్వారన్న వివరాలను సేకరించినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. నర్సంపేటలో ‘‘చీకటి–దొంగలు కలిసి దోపిడీ’’ చేస్తున్న పరిస్థితి నెలకొందని, వీరి ఆగడాలను అడ్డుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ద్వారా ఆధారాలతో హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఖానాపూర్ మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, బిఆర్టియూ జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.


