ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి గండి
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలస
పాలేరులో మారుతున్న సమీకరణాలు!
ఏదులాపురమే లక్ష్యంగా హస్తం వ్యూహం
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
మున్సిపల్ ఎన్నికల ముందే వేడెక్కిన రాజకీయాలు
కాకతీయ, కుసుమంచి : మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు హస్తం గూటికి చేరుతుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆదివారం ఖమ్మంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన చేరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభావం ఉన్న నేతల చేరికతో కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది.
ఆపరేషన్ ఆకర్ష్.. లక్ష్యం ఏదులాపురమే!
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంత్రి పొంగులేటి వ్యూహరచన చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే గ్రామ స్థాయిలో పట్టు ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా గుర్రాలపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కీలక నేత బుర్ర మహేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బుర్ర మహేష్ చేరికతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రతి పథకం లబ్ధి నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బొల్లం వెంకన్న, కొర్ని సీతారాములు, తీగల శివ, దుంపల నాగరాజు, బొబ్బల రాంబాబు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో పాలేరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


