డెర్బీలో క్యారిక్ డబుల్ దెబ్బ!
సిటీపై 2–0 గెలుపుతో యునైటెడ్‌లో కొత్త ఊపిరి
తొలి మ్యాచ్‌లోనే గార్డియోలాకు షాక్
కాకతీయ, స్పోర్ట్స్ : మాంచెస్టర్ యునైటెడ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే మైకేల్ క్యారిక్ అద్భుత ఆరంభం చేశాడు. శనివారం జరిగిన ప్రీమియర్ లీగ్ మాంచెస్టర్ డెర్బీలో యునైటెడ్ 2–0తో మాంచెస్టర్ సిటీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో నెలకొన్న నిరాశ వాతావరణం ఒక్కసారిగా తొలగింది. రుబెన్ అమోరిమ్ తొలగింపునకు తర్వాత సీజన్ ముగింపు వరకే ఒప్పందం పొందిన క్యారిక్‌కు ఇది తొలి పరీక్ష. అయితే 198వ డెర్బీలోనే పేప్ గార్డియోలా జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ తన సత్తా చాటాడు. మ్యాచ్ ఆరంభం నుంచే యునైటెడ్ దూకుడుగా ఆడింది. హ్యారీ మగ్వైర్ హెడర్ క్రాస్‌బార్‌ను తాకగా, రెండు గోల్స్ ఆఫ్‌సైడ్‌గా రద్దయ్యాయి. రెండో అర్ధభాగంలో డోన్నారుమ్మ అద్భుత సేవ్‌లు చేసినా ఒత్తిడి తప్పలేదు.
గోల్స్‌తో తేల్చేసిన డెర్బీ
65వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెస్ పాస్‌పై మ్బెయుమో గోల్ సాధించగా, 76వ నిమిషంలో డోర్గు మరో గోల్ జోడించాడు. ఈ విజయం యునైటెడ్ చాంపియన్స్ లీగ్ ఆశలను బలపరచగా, సిటీ టైటిల్ అవకాశాలకు గట్టి దెబ్బగా మారింది.


