నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఈ నెల 22 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల 1,257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్యకు 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ జరగనుంది. వెరిఫికేషన్ తేదీలు, సమయాల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని బోర్డు సూచించింది. వెరిఫికేషన్ అనంతరం తుది సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. 2024లో ఇప్పటికే 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ సిబ్బంది కొరత గణనీయంగా తగ్గనుంది.
రికార్డు స్థాయిలో నియామకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 9,572 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన నియామకాలతో సరిపెట్టుకోకుండా, 2026లో మరో 7,267 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్లు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ), ఫార్మసిస్టులు (గ్రేడ్-2), అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు తదితర పోస్టులు ఉన్నాయి.
నాడు 18 వేలకుపైగా ఖాళీలు
ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీ పోస్టుల సంఖ్య 18 వేలకుపైగా ఉండేది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీల భర్తీపై దృష్టి సారించడంతో, ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 16,839 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు అన్ని విభాగాల్లో నియామకాలు జరగడంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.
ఇప్పటికే భర్తీ పూర్తయిన పోస్టులు (మొత్తం: 9,572)
నర్సింగ్ ఆఫీసర్లు: 6,956
ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్-2): 1,542
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు: 425
ఇతర పోస్టులు: 649
ప్రస్తుతం భర్తీ ప్రక్రియలో ఉన్న పోస్టులు (మొత్తం: 7,267)
నర్సింగ్ ఆఫీసర్లు: 2,322
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్): 1,931
స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ): 1,623
ఇతర పోస్టులు: 1,391


