సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం
బ్లాంకెట్లు–స్వెటర్లు ఇవ్వడం లేదు
గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
చార్జీలు విడుదల కాక విద్యార్థుల ఇబ్బందులు
మేడారం వేదికగా ఎస్ఎఫ్ఐ నేతలు
కాకతీయ, ఏటూరునాగారం / వెంకటాపురం : గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బ్లాంకెట్లు,స్వెటర్లు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే అందించకపోతే మేడారం జాతరకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో నెలల తరబడి చార్జీలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు సరిపడా భోజనం కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. వార్డెన్లు అప్పులు తెచ్చి, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 8–9 నెలలుగా బెస్ట్ కాస్మోటిక్ చార్జీలు విడుదల కాకపోవడంతో కిరాణా దుకాణాల్లో అప్పులు పెరిగిపోయాయని, వాటిని చెల్లించలేని స్థితిలో వార్డెన్లు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ సమస్యలను గతంలోనే మంత్రి *సీతక్క*కు తెలియజేసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు.
జాతరకు కోట్లు… విద్యార్థులకు నిర్లక్ష్యం?
మేడారం జాతరకు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారని, కానీ గిరిజన విద్యార్థుల జీవితాలతో మాత్రం చెలగాటమాడుతున్నారని సోడి అశోక్ ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుని, అదే వ్యవస్థను పూర్తిగా తెలిసిన మంత్రి అయినప్పటికీ సమస్యలపై పట్టించుకోకపోతే విద్య భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందోనని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మేడారం జాతరకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి*ని అడ్డుకుంటామని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్ఎఫ్ఐ స్పష్టం చేసింది.


