ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం
సంగారెడ్డి ప్రజలకు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ
కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 2012–13లో ఇళ్ల పట్టాలు పొందినవారితో పాటు ఇప్పటికీ ఇంటి స్థలం లేని పేదలతో సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల ముఖా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… తాను 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే నివసించానని, అందుకే పేదలకు సొంత ఇంటి స్థలం ఉండాలనే బాధ తనకు ఎక్కువగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి సీఎం *కిరణ్ కుమార్ రెడ్డి*తో మాట్లాడి సంగారెడ్డిలో 5,500 మంది పేదలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించానని గుర్తు చేశారు. ఆ రోజు అలియాబాద్, తోగర్‌పల్లిలో పేదలకు ఇచ్చిన స్థలాలను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేరే పనులకు వినియోగించారని ఆరోపించారు. ఇచ్చిన స్థలాలపై పదేళ్లలో ఒక్కరూ ఎందుకు ప్రశ్నించలేదని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల భూసేకరణకు కలెక్టర్‌తో చర్చించామని, ఈ జనవరి నుంచే ప్రక్రియ ప్రారంభించి నవంబర్ నాటికి ఒక కొలిక్కి తీసుకొస్తామని తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక మళ్లీ ప్రజలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు లేని వారు కూడా మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెయ్యి నోటు, క్వార్టర్ సీసా కోసం జీవితాలను నాశనం చేసుకోకండని హితవు పలికారు. నెలకు రూ.5,000 కిరాయి చెల్లిస్తే ఏడాదికి రూ.60 వేలు, పదేళ్లకు రూ.6 లక్షలు నష్టపోయారని, ఆ రోజే సరైన నిర్ణయం తీసుకుంటే ఆ డబ్బు మిగిలేదని అన్నారు. తాను ఓడిపోయానని ఎప్పుడూ బాధపడలేదని, అదే ఓటమి వల్ల తన భార్య నిర్మల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అయ్యిందని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు తన వద్ద డబ్బులు ఉంటాయని, ఎన్నికల సమయానికే ఉండవని చమత్కరించారు. తాను ఓటుకు డబ్బులు ఇచ్చే రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో లేకపోయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నామని, తన మాటకు విలువ ఉందని, సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పేది వింటారని చెప్పారు. “జగ్గారెడ్డి గా మాట ఇస్తున్నా… సంగారెడ్డిలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం తప్పకుండా ఇస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.


