కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులకే సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ కు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. అతని పదవీకాలాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ వరకు అతను చీఫ్ సెలక్టర్ పదవిలో కొనసాగనున్నాడు. 2023లో చీఫ్ సెలక్టర్ గా ఎంపికైన అజిత్ పనితీరుపై బీసీసీఐ మేనేజ్ మెంట్ సంత్రుప్తిగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ముందే ముగియాల్సిన పదవీకాలం పొడిగించింది.
ఇప్పుడు మళ్లీ ఎక్స్ టెన్షన్ ఇవ్వడం గమనార్హం. 2026లో టీ20 ప్రపంచ కప్ రానుంది. అది ముగిసిన అనంతరం మరోసారి అజిత్ అగార్కర్ పదవిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత టీ 20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కప్ లను గెలవడంతోపాటు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ కు చేరుకుంది భారత్. శుభ్ మన్ గిల్ కు టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం కూడా అగార్కర్ హయాంలోనే జరిగిన సంగతి తెలిసిందే.
ఇక టీమ్ సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ కాకుండా 5గురు సభ్యులు కూడా ఉంటారు. ప్రస్తుతం ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ మెంబర్స్ గా ఉన్నారు. చీఫ్ సెలక్టర్ గా అజిత్ అగార్కర్ వ్యవహరిస్తున్నారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ లో జరుగుతుంది. సెలక్షన్ కమిటీలో పలు మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
ఒకరిని తొలగించి..మరొకరికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎస్. శరత్ స్థానంలో కొత్త వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది బీసీసీఐ. బీసీసీఐ నిబంధనల ప్రకారం కమిటీ సభ్యుడిని నాలుగు సంవత్సరాలు మాత్రమే పదవీకాలం ఉంటుంది. ఈ లెక్కన శరత్ టెన్యూర్ ముగుస్తుంది. మరోవైపు ఎస్ఎస్ దాస్, బెనర్జీ విషయంలో మేనేజ్ మెంట్ సంత్రుప్తికరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.


