ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలకు వీహెచ్‌పీ కౌంటర్
కాకతీయ, సినిమా : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (VHP) ఘాటుగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇటీవల *బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్*కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని అన్నారు. దీనికి ఇండస్ట్రీలో మారిన ‘పవర్ షిఫ్ట్’ ఒక కారణమైతే, ‘మతతత్వం’ కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయం నేరుగా ఎవరూ చెప్పకపోయినా, పుకార్ల రూపంలో తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
వీహెచ్‌పీ ఘాటు స్పందన
రెహమాన్ వ్యాఖ్యలను వినోద్ బన్సల్ తప్పుబట్టారు. తనకు ఎందుకు పని దొరకడం లేదో ఆత్మపరిశీలన చేసుకోకుండా, మొత్తం పరిశ్రమ వ్యవస్థను నిందించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏమి నిరూపించాలనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ, హిందీ చిత్ర పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని స్పష్టం చేశారు. దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తుచేశారు. అలాగే, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ప్రముఖ నిర్మాత–దర్శకుడు రెహమాన్ వ్యాఖ్యలను ‘చౌకబారు విమర్శ’గా కొట్టిపారేశారు. రెహమాన్ సంగీతంలో నాణ్యత తగ్గడం, అధిక ఫీజు డిమాండ్ చేయడం, పాటలు ఆలస్యంగా ఇవ్వడం వంటి కారణాల వల్లే అవకాశాలు తగ్గాయని, మతపరమైన కోణం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలతో రెహమాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు నాంది పలికినట్లయ్యింది.


