రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీతో భేటీ
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శనివారం ప్రజాభవన్‌లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి*కి లేఖ రాసిన విషయం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి హామీ ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ చట్టాన్ని కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
కమిటీ కీలక డిమాండ్లు
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పలు కీలక అంశాలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రోహిత్ వేముల కేసును పూర్తిగా పారదర్శకంగా విచారించి న్యాయం చేయాలని, ఆయన మరణానంతరం యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు అధ్యాపకులపై నమోదైన నాన్‌బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కర్ణాటక ప్రతినిధులుగా హులికుంటే మూర్తి (సీనియర్ అంబేద్కరివాది నాయకుడు), డా. ఆశ్నా సింగ్ (నేషనల్ లా యూనివర్సిటీ–బెంగళూరు), వి. మృదుల (అడ్వకేట్), రాహుల్ (ASA–జీకేవీకే) పాల్గొన్నారు. హైదరాబాద్ జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఉద్యమం తరఫున రాధికా వేముల, రాజా వేముల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్లు భాంగ్య భుక్య, సౌమ్యా దేచమ్మ, తిరుమల్, రత్నం, తెలంగాణ హైకోర్టు నియమిత సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్, డా. డోంత ప్రశాంత్,ఏఎస్ ఏప్రతినిధులు తిరుపతి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీతో రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టంపై ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన సంకల్పం వ్యక్తమైందని కమిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


