జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత
అరైవ్ అలైవ్‌లో యువతకు అవగాహన
కాకతీయ, హనుమకొండ : ప్రతి వాహనదారుడు తన జీవితం ఎంతో విలువైనదని గుర్తించి అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక నర్సింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా యువత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకరమని తెలిపారు. యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, రహదారి భద్రత విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకమవుతుందని హెచ్చరించిన ఆమె, ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ వ్యాసాలు రాసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ఏసీపీ సత్యనారాయణ, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


