వర్ధన్నపేటలో హోరెత్తిన నిరసన..!
వంద పడకల ఆసుపత్రి కోసం బంద్
స్వచ్ఛందంగా వ్యాపార–వాణిజ్య సంస్థల సంపూర్ణ మద్దతు
సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
కాకతీయ, రాయపర్తి/వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణం మరోసారి గర్జించింది. వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలన్న డిమాండ్‌తో శనివారం వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆసుపత్రి సాధన సమితి పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, వ్యాపారులు పెద్ద ఎత్తున కదలిరావడంతో పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార వీధులు వెలవెలబోయాయి. కిరాణా దుకాణాల నుంచి పెట్రోల్ బంకులు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల వరకు యజమానులు స్వచ్ఛందంగా షట్టర్లు దించి నిరసనకు మద్దతు ప్రకటించారు. ఉదయం నుంచే యువకులు, ప్రజా సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.

రిలే దీక్షలు ఫలితం లేకపోవడంపై ఆగ్రహం
గత పది రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆసుపత్రి సాధన సమితి సభ్యులు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో *ఎంజీఎం ఆసుపత్రి*కి వెళ్లేలోపే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే స్థానిక ప్రజలకు ప్రాణ రక్షణగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప, ఆచరణలో ఆసుపత్రి నిర్మాణం అడుగు ముందుకు పడలేదని స్థానికులు మండిపడ్డారు. బంద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హెచ్చరించినట్లు సమాచారం. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. ఈ బంద్ ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమేనని, ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయాలని సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. వర్ధన్నపేట ఆసుపత్రి పూర్తిగా అప్‌గ్రేడ్ అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


