లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు
ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల కేటాయింపు ప్రక్రియ పూర్తి
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎంపిక
ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
కాకతీయ, ఖమ్మం : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన వార్డులను లాటరీ పద్ధతి ద్వారా ఖరారు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో మహిళలకు రిజర్వేషన్ కేటాయించే ప్రక్రియను శనివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అనుసరిస్తూ మహిళా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఎటువంటి అనుమానాలకు తావులేకుండా లాటరీ విధానం ద్వారా వార్డులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.
ఐదు మున్సిపాలిటీల్లో ఎంపిక
సత్తుపల్లి, మధిర, ఏదులాపురం, వైరా, కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ స్థితిగతులను వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన మహిళా రిజర్వేషన్ వార్డులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఖరారు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, ఎలక్షన్ సెక్షన్ డీటీ అన్సారీతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.


