మున్సిపల్ “పోరు”కి సిద్ధం
కొత్తగూడెం కార్పోరేషన్‌కు తొలిపోరుకు రంగం సిద్ధం
ఎస్టీ జనరల్‌కు మేయర్ పీఠం రిజర్వుడ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. డివిజన్లకు, మేయర్ స్థానానికి రిజర్వేషన్ల ఖరారుతో కార్పోరేషన్ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే అన్ని పార్టీల లక్ష్యంగా మారింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల కారణంగా చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్, ఈసారి ఒంటరి పోరుతో బరిలోకి దిగాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం, సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ మేయర్ సీటు ఎస్టీ వర్గానికి రిజర్వ్ కావడంతో అనేక మంది ఎస్టీయేతర నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇప్పుడు ఆ సీటుకు సరైన అభ్యర్థిని ముందుకు తెచ్చే దిశగా అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.
కొత్తగూడెంలో రిజర్వేషన్లు ఇలా…
కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు ఇలా ఉంది.
బీసీలకు : 7 స్థానాలు, జనరల్ : 14 స్థానాలు, ఎస్టీలకు : 11 స్థానాలు (మహిళలు – 5), ఎస్సీలకు : 12 స్థానాలు (మహిళలు – 6), బీసీ మహిళలు : 3 స్థానాలు, మొత్తం మహిళలకు : 14 స్థానాలు
మూడు వార్డులను కలిపి ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసి, సుమారు 2,500 ఓట్లను ఒక డివిజన్‌గా పరిగణించారు.
60 డివిజన్లకు సంబంధించి.. డివిజన్ వారీగా రిజర్వేషన్లు ఇలా..
ఎస్టీ డివిజన్లు: 3, 9, 19, 20, 23, 31, 32, 33, 34, 48, 52
ఎస్సీ డివిజన్లు: 12, 13, 15, 17, 18, 24, 26, 28, 35, 43, 47
బీసీ డివిజన్లు: 21, 30, 46, 53, 55, 59, 60
అన్‌రిజర్వ్డ్ డివిజన్లు: 1, 2, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 16, 22, 29, 36, 37, 38, 39, 41, 42, 44, 45, 49, 51, 54, 56, 57, 58


