విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి
ఖమ్మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ
కాకతీయ, ఖమ్మం : పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జనవరి 23, 24, 25 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరగనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం పట్టణంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పీడీఎస్‌యూ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి పరిస్థితుల్లో విద్య అంగడి సరుకులా మారిపోయి, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి అందని ద్రాక్షలా తయారైందని కాంపాటి పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు, మెస్ చార్జీలపై ఆధారపడి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నేటి పాలకుల విధానాలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయని అన్నారు. జనవరి 23, 24, 25 తేదీలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో 23వ పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు టి. లక్ష్మణ్, వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, యశ్వంత్, సహాయ కార్యదర్శులు సాదిక్, శశి, జిల్లా నాయకులు హరిచంద్ర ప్రసాద్, సురేష్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.


