ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
మున్సిపాలిటీలకు నిధులు వచ్చేలా చేస్తాం
అవసరమైతే సీఎస్సార్ నిధులు కూడా
కాంగ్రెస్ పాలనపై శ్వేతపత్రం డిమాండ్
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీయేనని ధీమా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ—మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెడితే ఢిల్లీకి వెళ్లి నేరుగా ప్రధాని *నరేంద్ర మోదీ*ని కలిసి కేంద్రం నుంచి భారీ నిధులు తీసుకొస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి కేంద్ర నిధులతో పాటు అవసరమైతే సీఎస్సార్ వనరులనూ సమీకరిస్తామని, మాటలకన్నా పనితోనే పాలనకు ప్రమాణం చూపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. నిజంగా దమ్ముంటే ఈ కాలంలో ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. “జై శ్రీరాం” నినాదానికే కాంగ్రెస్ వణుకుతోందని, ప్రజలే స్వయంగా బీజేపీకి ఆ నినాదంతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
అసలు పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్యే
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలహీనమైందని, ఈ ఎన్నికల్లో అసలైన పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్యేనని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలను ఆధారంగా తీసుకోవాలని, గెలిచే అవకాశమున్న కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో ఎంఐఎంకు లాభం చేకూర్చేలా కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. కరీంనగర్ నుంచి నిర్మల్ వరకూ మజ్లిస్‌తో ఒప్పందాల మాటలు వినిపిస్తున్నాయని, ఈ కుట్రలను బీజేపీ చిత్తు చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రజాబలంతోనే బీజేపీ బరిలోకి
కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బును నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నాయని, బీజేపీ మాత్రం ప్రజలనే నమ్ముకుని బరిలోకి దిగుతోందన్నారు. అభివృద్ధి, ప్రజాసమస్యలు, హిందుత్వమే బీజేపీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. పోలింగ్ వరకు కార్యకర్తలు ఒక్కో ఇంటికి కనీసం ఆరు సార్లు వెళ్లి ప్రజలకు నేరుగా భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ పదవులు లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు.


