పొచమ్మకుంటలో హరివిల్లు
రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
విజేతలకు బహుమతులు అందజేసిన పేరం గోపికృష్ణ
కాకతీయ, హనుమకొండ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్ పరిధిలోని పొచమ్మకుంట కాలనీలో రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు పండుగ సందడిని రెట్టింపు చేశాయి. కాలనీ అంతటా ముంగిళ్లు రంగురంగుల రంగవల్లులతో మెరిసిపోతూ హరివిల్లును తలపించాయి. మహిళలు సృజనాత్మకంగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు కాలనీ పెద్దలు సంజీవ రెడ్డి, రంగారెడ్డి, కేశబోయిన మోహన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతి – దొడ్డిపాటి వసంత, అల్లంకి చిత్ర, రెండో బహుమతి – దుంపల విజయలక్ష్మీ, దుబ్యాల స్రవంతి, మూడో బహుమతి – కొడిదెల సమ్మక్క, బైన జ్యోతి, పైండ్ల కల్పన విజేతలుగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి రుద్రా ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, మహిళల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కాలనీల్లో ఐక్యత, సామాజిక ఐకమత్యం పెంపొందించడమే రుద్రా ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీకటి సతీష్, వీరాచారి, రాజు, సునీల్, రాము, రమణాచారి, వివేక్, ప్రసాద్, క్రాంతి, వెంకన్న, అరుణ్, అభిషేక్, ధనుష్, నాగరాజు, సూర్యతేజ, రాజకుమార్‌లతో పాటు పలువురు కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




