కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరం
పోరాట పంథాలో మార్పు అనివార్యం
సంపద దోచుకునేవారే దేశభక్తులా?
శతాబ్ది ఉత్సవాలు చారిత్రక ఘట్టం
వేడుకల్లో ఖమ్మం జిల్లా భాగస్వామ్యం గర్వకారణం
కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కమ్యూనిజం అజరామరమని, ప్రజల్లో మరింత చైతన్యం కోసం కమ్యూనిస్టులుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఖమ్మం వేదికగా జరపడం ఓ చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. యువత ఓ చట్రంలో బిగుసుకు పోవడం సరైంది కాదని, కాలానికి అనుగుణంగా పోరాట పంథాలో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సాంబశివరావు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం సమాజం అనుభవిస్తున్న కార్మిక, కర్షక ఫలాలు కమ్యూనిస్టుల దీర్ఘకాల పోరాటాల ఫలితమేనని కూనంనేని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడేది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు, విధానాలు, త్యాగాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
సంపద దోచుకునేవారే దేశభక్తులా?
అటవీ సంపదను, ప్రజల శ్రమను దోచుకునేవారు దేశభక్తులుగా చెలామణి అవుతుండగా, హక్కుల కోసం పోరాడేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని కూనంనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరప్రవృత్తి కలిగినవారు, దోపిడీ చేసేవారు, డబ్బు సంపాదించేవారే దేశభక్తులుగా మారుతున్న పరిస్థితి దురదృష్టకరమన్నారు. కాళోజీ మాటలను గుర్తు చేస్తూ… “ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అయితే, ఒక్క కమ్యూనిస్టు లక్షల కోట్ల మెదళ్లకు మేథ” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పొత్తులు, ఎత్తుగడలు ఎలా ఉన్నా అవి ఎన్నికల వరకే పరిమితమని, కమ్యూనిస్టుల ఐక్యతే తమ అభిమతమని కూనంనేని స్పష్టం చేశారు. మనుషులు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని చెప్పారు. అనేక దేశాల్లో ఎర్రజెండాలు ఏకమై రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల ఐక్యత ప్రజల కోరికేనని, దేశానికి–సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు. బూర్జువా పార్టీలతో సందర్భోచితంగా కలిసి పనిచేయడం అనివార్యమని, అది ఎన్నికల వ్యూహంలో భాగమేనని తెలిపారు. ప్రభుత్వం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అప్రజాస్వామిక పోకడలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నామని అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. భారీ బహిరంగ సభతో పాటు ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల కామ్రేడ్స్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరవుతారని వెల్లడించారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌహార్ద సందేశం ఇస్తారని తెలిపారు.
వేడుకల్లో భాగస్వామ్యం గర్వకారణం
శతాబ్ది ఉత్సవాల్లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పాలుపంచుకోవడం గర్వంగా ఉందని జిల్లా సీపీఐ కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. ఉద్యమాలకు ఊపిర్లూదిన ఖమ్మంలో ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్, టీబీజేఏ, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, సీపీఐ రాష్ట్ర–జిల్లా–నియోజకవర్గ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


