ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.. ప్రజలు ఆశీర్వదించాలి
ములుగు మాజీ జడ్పీటీసీ సకినాల భవాని
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతున్నట్లు ములుగు మాజీ జడ్పీటీసీ సకినాల భవాని తెలిపారు. శనివారం ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ములుగు మునిసిపాలిటీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వుడు అయిందని మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుని.. చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. బీసీ బిడ్డగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాను ఆశాభావంతో ఉన్నానన్నారు. ములుగు జిల్లా ఏర్పాటూ, మున్సిపాలిటీ ఏర్పాటు కూడా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలను, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కారణంగా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ మహిళగా జిల్లాలోని బీసీలకు ప్రతినిధిగా నిలిచి పార్టీని ఏకతాటిపైకి తెచ్చి విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. తాను గతంలో జడ్పీటీసీగా పనిచేశానని, తండ్రి దివంగత సకినాల శోభన్ కూడా ములుగు జెడ్పిటిసి గా సేవలందించారని గుర్తు చేశారు


