వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!
శతాబ్ది ముగింపు సభకు ఖమ్మం గడ్డ సిద్ధం
ఎర్రజెండాతోనే మతోన్మాదానికి కళ్లెం
లక్షమంది తరలివచ్చేలా సన్నాహాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : వందేళ్ల సీపీఐ పోరాటాల స్పూర్తితో ప్రజా ఉద్యమాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని, ఖమ్మం నగరంలో జరగనున్న సీపీఐ శతాబ్ది ముగింపు బహిరంగ సభను ఆ పోరాటాలకు వేదికగా మలుచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలో జరగనున్న శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని వన్నందాస్ గడ్డ, పాత కొత్తగూడెం, బర్మా క్యాంపు, ప్యూన్ బస్తి, బూడిదగడ్డ, మేదరబస్తీ, ప్రగతి నగర్‌తో పాటు లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల దాడులను అడ్డుకోగల శక్తి కేవలం ఎర్రజెండాకే ఉందన్న విషయాన్ని సిపిఐ వందేళ్ల చరిత్ర నిరూపించిందని సాబీర్ పాషా స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ సిపిఐ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.
ఖమ్మం సభతో నూతన ఉత్తేజం
ఖమ్మంలో జరగనున్న శతాబ్ది ముగింపు సభలో వేలాది మంది క్రమశిక్షణాయుత రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, విప్లవ గీతాల సాంస్కృతిక ప్రదర్శనలు పీడిత వర్గాల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని తెలిపారు. ఈ సభ ఖమ్మం నగరాన్ని ఎర్ర సంద్రంలా మార్చే శక్తిని కలిగి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, శతాబ్ది ముగింపు సభను సక్సెస్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రచార జాతాలు నిర్వహించి సభపై విస్తృత ప్రచారం పూర్తి చేసినట్లు తెలిపారు. కరపత్రాలు, పోస్టర్లు, మీడియా మాధ్యమాల ద్వారా అన్నివర్గాల ప్రజలకు, ప్రతి గడపకు సభ సమాచారాన్ని చేరవేశామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే లక్షమంది స్వచ్ఛందంగా ఖమ్మం తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార సభల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప పద్మ, నాయకులు నూనావత్ గోవిందు, గోపి కృష్ణ, గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీను, శాపావత్ రవి, మోతిరాం, రాములు తదితరులు పాల్గొన్నారు.


