మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా ప్రార్థనలు
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, రాయపర్తి/ఐనవోలు : ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతి జాతర ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆలయానికి చేరుకున్న ఎర్రబెల్లికి ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎర్రబెల్లి, స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ప్రశాంత జీవనం సాగించాలని మల్లన్నను వేడుకున్నట్లు తెలిపారు. మకర సంక్రాంతి జాతర నేపథ్యంలో ఐనవోలు క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్న తరుణంలో మాజీ మంత్రి పూజలు నిర్వహించడం విశేషంగా మారింది. ప్రజల కష్టాలు తొలగి, రాష్ట్రానికి శాంతి, సమృద్ధి కలగాలని కోరుకుంటూ మల్లన్న సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు.


