క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం
యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు
సంక్రాంతి సందర్భంగా మహిళలు, పిల్లలకు పోటీలు
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సర్పంచ్ రవి నాయక్
కాకతీయ, మరిపెడ : క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అజ్మీర తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా రవి నాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలోని అజ్మీర గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలు, పిల్లల కోసం వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ రవి నాయక్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కుర్చీల పందెం, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు గ్రామంలోని మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రైస్ కుక్కర్, ద్వితీయ బహుమతిగా సీలింగ్ ఫ్యాన్, తృతీయ బహుమతిగా పప్పు కుక్కర్లను అందజేశారు.
యువత భవిష్యత్‌కు క్రీడలు పునాది
ఈ సందర్భంగా సర్పంచ్ అజ్మీరా రవి నాయక్ మాట్లాడుతూ, క్రీడలు నేటి సమాజంలో యువతకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు స్నేహబంధాలను మరింత బలపరుస్తాయని అన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు. ఓటమిని నిరాశగా కాకుండా రేపటి గెలుపుకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. భవిష్యత్‌లో ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీర శ్రీను నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వసంత శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ కొండూరు వెంకన్న, సూరారపు వెంకన్న, ధరావత్ శ్రీను, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు, తాండవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


