సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు
కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. గత నాలుగు రోజులుగా కొనసాగిన వాలీబాల్, క్రికెట్ పోటీలు శుక్రవారం హోరాహోరిగా ముగిశాయి. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడంతో ఆటస్థలాలు క్రీడాభిమానులతో కిటకిటలాడాయి. వాలీబాల్ పోటీల్లో గ్రామ సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్‌తో కలిసి రామగిరి శ్యామ్ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి విజేతగా నిలిచింది. ఈ జట్టుకు మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి రూ. 3,016 నగదు బహుమతిని అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన రాసాల రామ్మూర్తి జట్టుకు ఎండి అబ్దుల్ రూ. 2,016 నగదు బహూకరించారు.
క్రికెట్‌లో కన్నబోయిన రాజు జట్టు సత్తా
క్రికెట్ పోటీల్లో కన్నబోయిన రాజు జట్టు విజేతగా నిలవగా, మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మీనారాయణ మొదటి బహుమతిగా రూ. 3,016 అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన ఎండి మొయినుద్దీన్ జట్టుకు దువ్వ అనిల్ రూ. 2,016 నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్ మాట్లాడుతూ, గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, ఐక్యత పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.


