డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ
ఆర్టీసీ డ్రైవర్ల భుజాలపైనే వేలాది మంది భద్రత
‘ఆరైవ్.. ఆలైవ్’లో కీలక సూచనలు చేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత పూర్తిగా ఆర్టీసీ డ్రైవర్లపైనే ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. రహదారి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరైవ్.. ఆలైవ్’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వరంగల్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో హనుమకొండ సిటీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఒక పెద్ద సవాలుగా మారాయని, ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునే ముందు కఠినమైన శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించడం వల్లే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఈ తగ్గుదలకు డ్రైవర్ల క్రమశిక్షణ, బాధ్యతాయుత డ్రైవింగ్‌నే ప్రధాన కారణమని పేర్కొంటూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
రాత్రి వేళ డ్రైవింగ్‌లో అప్రమత్తత తప్పనిసరి
రాత్రి సమయంలో బస్సులు బ్రేక్‌డౌన్ అయినప్పుడు తప్పనిసరిగా బస్సు వెనుక భాగంలో రెడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, వాహనాలను రోడ్డుపై అస్తవ్యస్తంగా నిలిపివేయవద్దని డ్రైవర్లకు సీపీ సూచించారు. త్వరలో నిర్వహించనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, బస్సుల నిర్వహణలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. రహదారి మధ్యలో బస్సులను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సుదీర్ఘకాలంగా డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ ఒక్క ప్రమాదం కూడా జరగకుండా సేవలందించిన ఆర్టీసీ డ్రైవర్లను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించారు. వారి సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భానుకిరణ్, డిపో మేనేజర్ ధర్మంసింగ్, కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్‌తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


