మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!
సామాన్య భక్తులపై మాత్రం కఠినత్వం
వృద్ధులు–వికలాంగుల్ని పట్టించుకోని వైఖరి
పోలీస్ కుటుంబాలకు ప్రత్యేక దారి..!
‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే కదా?’
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు కొనసాగుతున్న వేళ, జాతర అధికారిక ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం గద్దల వైపు భక్తిశ్రద్ధలతో కదిలారు. అయితే గద్దల వద్ద డ్యూటీలో ఉన్న కొందరు పోలీసుల వైఖరి సామాన్య భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. శుక్రవారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో భద్రతా చర్యలలో భాగంగా పోలీసు యంత్రాంగం అమ్మవార్ల గద్దల చుట్టూ భారీ ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది. కంచెల వెలుపల నుంచే దర్శనం కల్పించడమే సరైన నిర్ణయమని చాలా మంది భావించారు. రద్దీ నియంత్రణ, భక్తుల భద్రత దృష్ట్యా ఇది అవసరమేనని అభిప్రాయపడ్డారు.
పోలీస్ కుటుంబాలకు ప్రత్యేక దారి..!
అయితే అదే సమయంలో గద్దల వద్ద విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసులు తమకు తెలిసినవారికి, ముఖ్యంగా ఇతర పోలీస్ కుటుంబాలకు మాత్రమే గేట్లు తెరిచి గద్దల ప్రాంగణంలోకి అనుమతించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సామాన్య భక్తులు గంటల తరబడి కంచెల వెలుపల నిలబడినా, పోలీస్ కుటుంబాలు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా గద్దల వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవడం చూసి భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముసలివారు, వికలాంగులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు ఎండలో, గుంపుల మధ్య నలుగుతూ కంచెల వెలుపలే ఉండిపోయినా పట్టించుకోని పరిస్థితి కనిపించింది. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు బయట నుంచే మొక్కులు చెల్లించుకోవాల్సి రాగా, పోలీస్ కుటుంబాలకు మాత్రం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అన్యాయమని భక్తులు వాపోయారు.
‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే కదా?’
అమ్మవార్ల దర్శనం కోసం వచ్చిన భక్తులు, ‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే… కానీ ఇక్కడ మాత్రం పోలీస్ వారికే ప్రాధాన్యం. మేమంతా భక్తులం కాదా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ‘తెలిసినవారు’ అనే కారణంతో గేట్లు తెరవడం పోలీసుల విధి నిర్వహణపై ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. మేడారం మహాజాతర కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఇలాంటి పవిత్రమైన సందర్భంలో అధికారులు, పోలీసుల వైఖరి సమానత్వంతో ఉండాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ అయినా, సామాన్యుడైనా – అమ్మవార్ల ముందు అందరూ ఒక్కటేనన్న భావనను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని భక్తులు స్పష్టం చేస్తున్నారు.


