‘సెహ్వాగ్, యువరాజ్ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’
సరదాగా వ్యాఖ్యానించిన మొహమ్మద్ కైఫ్
కపిల్ షోలో నవ్వులు పూయించిన క్రికెటర్ల సంభాషణ
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్లు విరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2000ల ప్రారంభంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ముగ్గురు కలిసి ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కైఫ్–యువరాజ్ జోడీ చేసిన పోరాటం ఇప్పటికీ అభిమానుల జ్ఞాపకాల్లో చెరిగిపోని ఘట్టంగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తాజా ఎపిసోడ్ టీజర్‌లో కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘సెహ్వాగ్, యువరాజ్ ఇద్దరూ భుజాలు తాకించుకుంటేనే రూ.5–6 కోట్లు జారిపడతాయి. వాళ్లతో పోలిస్తే నేను చాలా పేదవాడిని’ అంటూ కైఫ్ సరదాగా వ్యాఖ్యానించాడు.
గూచీ షూస్‌తో కౌంటర్!
కైఫ్ వ్యాఖ్యలకు యువరాజ్ సింగ్ చమత్కారంగా స్పందించాడు. ‘నువ్వు వేసుకున్న షూస్ ఏవి?’ అని ప్రశ్నించగా, ‘గూచీ’ అని కైఫ్ సమాధానం ఇచ్చాడు. దానికి యువరాజ్, ‘ఇతనే పేదవాడా?’ అంటూ నవ్వులు పూయించాడు. మొహమ్మద్ కైఫ్ కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే ఇన్నింగ్స్ 2002 నాట్‌వెస్ట్ ఫైనల్‌లో లార్డ్స్‌లో నమోదైంది. 326 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 146/5తో కష్టాల్లో ఉన్న సమయంలో కైఫ్ (87 నాటౌట్), యువరాజ్ (69) కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చివరి మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.


