భారత్‌కు స్పిన్ టెన్షన్
న్యూజిలాండ్ స్పిన్నర్ల ముందు తడబడిన భారత బ్యాటర్లు
కుల్దీప్ ఫామ్‌పైనా తలెత్తుతున్న సందేహాలు
మిడిల్ ఓవర్లలో బయటపడిన బలహీనతలు
మూడో వన్డేలో సెటవుతుందా.. విఫలమవుతారా..?!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను నిర్ణయించే మూడో మ్యాచ్‌కు ముందు టీమిండియా తమ బౌలింగ్ కాంబినేషన్‌ను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. తొలి రెండు వన్డేల్లో భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు ధైర్యంగా ఎదుర్కొనగా, కివీస్ స్పిన్నర్ల ముందు భారత బ్యాటింగ్ లయ కోల్పోయింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఎదుర్కొన్న పరాజయం మిడిల్ ఓవర్లలో ఉన్న బలహీనతలను స్పష్టంగా బయటపెట్టింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. లైన్, లెంగ్త్‌పై నియంత్రణ కోల్పోయిన కుల్దీప్‌ను న్యూజిలాండ్ బ్యాటర్లు, ముఖ్యంగా డారిల్ మిచెల్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముందుకు వచ్చి ఆడుతూ టర్న్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు భారత మిడిల్ ఓవర్ ప్లాన్స్‌ను భగ్నం చేశారు.
స్వీప్ షాట్లతో స్పిన్నర్లకు చెక్
కివీస్ బ్యాటర్లు కుల్దీప్‌పై స్వీప్ షాట్లను సమర్థవంతంగా వినియోగించారు. ఇదే వ్యూహాన్ని టెస్టుల్లోనూ అమలు చేసిన న్యూజిలాండ్, వన్డేల్లోనూ అదే ఫలితం సాధించింది. భారత స్పిన్నర్లు సమష్టిగా ఒత్తిడి సృష్టించడంలో విఫలమవ్వగా, న్యూజిలాండ్ స్పిన్నర్లు మాత్రం భారత స్కోరింగ్‌ను కట్టడి చేసి కీలక వికెట్లు సాధించారు. ఇండోర్ హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ వెరైటీ కన్నా కచ్చితత్వమే ముఖ్యం. భారత బౌలర్లు, ముఖ్యంగా కుల్దీప్ ఫ్లైట్ తగ్గించి, ఫ్లాట్‌గా బంతులు వేసి, స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద గ్రౌండ్ భాగాలను సరిగ్గా వినియోగిస్తూ బౌండరీ అవకాశాలను తగ్గించాల్సి ఉంటుంది.
వాషింగ్టన్ సుందర్ లేని లోటు..!
రాజ్‌కోట్ వన్డేలో గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ లేమి స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేయడం టీమ్ బ్యాలెన్స్‌పై ప్రభావం చూపింది. పరిస్థితులను బట్టి ఆఫ్ స్పిన్ వేయగల ఆయుష్ బడోనీని తుది జట్టులోకి తీసుకోవాలన్న చర్చ సాగుతోంది. అయితే ఒక్క మ్యాచ్‌కే నితీష్‌ను పక్కన పెట్టేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. స్పిన్‌తో ఉన్న రిస్క్‌ను తగ్గించేందుకు పేస్ విభాగాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఎడమచేతి పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని అంచనా. అలా అయితే ఇప్పటివరకు బాగానే రాణించినా ప్రసిద్ధ్ కృష్ణ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది.
అర్ష్‌దీప్‌కు ఎందుకు ప్లస్?
ప్రసిద్ధ్ సహజ లెంగ్త్ బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ కావడం ఇండోర్ లాంటి చిన్న మైదానంలో ఇబ్బందిగా మారవచ్చు. పూర్తి లెంగ్త్‌తో బౌలింగ్ చేసే అర్ష్‌దీప్ ఇక్కడ మరింత ప్రభావవంతంగా ఉండగలడని టీమ్ భావిస్తోంది. మొహమ్మద్ సిరాజ్ పేస్ అటాక్‌ను నడిపించడం ఖాయం. జడేజా ఒక్కడే స్పిన్నింగ్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతాడా? లేక అదనపు పేసర్‌ను తీసుకుంటారా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త బంతితో తొలివికెట్లు పడగొట్టడమే భారత్‌కు కీలకం. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ భారత ప్రణాళికలో కీలకంగా కొనసాగనున్నారు.
హోల్కర్‌లో భారత్‌దే పైచేయి
హోల్కర్ స్టేడియంలో భారత్‌కు అద్భుత రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు వన్డేల్లో భారత్ అన్నింటిలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్ (2006, 2008), వెస్టిండీస్ (2011), దక్షిణాఫ్రికా (2015), ఆస్ట్రేలియా (2017)పై ఇక్కడ గెలిచింది. సిరీస్ దావుపై ఉన్న నేపథ్యంలో ప్రయోగాలకంటే అమలే కీలకంగా మారనుంది. తొలివికెట్లు, మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌లో చురుకుదనం భారత్ విజయానికి మార్గం వేయనున్నాయి.


