రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’పై క్లారిటీ
మార్చ్ 19కే రిలీజ్ – రూమర్స్‌కు చెక్
కాకతీయ, సినిమా : బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న భారీ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ – నటుడు రణ్వీర్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నెలన్నర గడిచినా థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది. దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేసి భారీ రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ధురంధర్ 2’ విడుదల తేదీని ఇప్పటికే మార్చ్ 19గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే తేదీన మరికొన్ని సినిమాలు ఉండటంతో, పార్ట్ 2 వాయిదా పడుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ స్వయంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ‘ధురంధర్ 2 మార్చ్ 19కే విడుదల’ అంటూ స్పష్టత ఇచ్చి వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. పార్ట్ 1 బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నేపథ్యంలో, ధురంధర్ 2 ఎలాంటి స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.


