రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక గంభీర్ హస్తం?
సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారీ
అగార్కర్ నిర్ణయానికి ‘ఇన్‌పుట్స్’ ఎవరివి?
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ తొలగింపులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం తప్పకుండా ఉండి ఉంటుందని తివారీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరున్నా, రోహిత్ శర్మలాంటి సీనియర్ ప్లేయర్ విషయంలో ఆయన ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకుని ఉండరని తివారీ అభిప్రాయపడ్డారు. ‘అజిత్ అగార్కర్ నాకు బాగా తెలుసు. ఆయన స్ట్రాంగ్ పర్సనాలిటీ. కానీ ఇంత పెద్ద మార్పు చేయాలంటే కోచ్ ఇన్‌పుట్స్ తప్పకుండా ఉంటాయి. ఎవరో ఒకరి సపోర్ట్‌తోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని తివారీ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల ద్వారా గంభీర్ పాత్రపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.
గెలిచిన కెప్టెన్‌ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం?
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 వరల్డ్ కప్‌ను, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. వరుసగా టైటిల్స్ సాధించిన కెప్టెన్‌ను వన్డేల నుంచి తప్పించడం ఆశ్చర్యకరమని తివారీ వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికినా, వన్డేల్లో మాత్రం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని తివారీ తెలిపారు. 2027 వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న సమయంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా రోహిత్‌కు తగిన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని తివారీ తెలిపారు. ‘రోహిత్‌ను ఇలా అవమానించడం చూసి వన్డే క్రికెట్ చూడాలన్న ఆసక్తే పోయింది. సెలెక్షన్‌లోనూ, కెప్టెన్సీ మార్పులోనూ ఎలాంటి క్రికెటింగ్ లాజిక్ కనిపించడం లేదు. స్పష్టత లేకపోవడమే వివాదాలకు కారణం’ అని ఘాటుగా విమర్శించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక గౌతమ్ గంభీర్ పాత్ర ఉందన్న ప్రచారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


