నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు
59 మంది కానిస్టేబుళ్లపై సీసీఎస్‌లో ఫిర్యాదు
పోలీస్ శాఖలో సంచలనాత్మకంగా ఘటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన కానిస్టేబుళ్ల బాగోతం వెలుగులోకి వస్తోంది. తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లను సమర్పించి 59 మంది ఉద్యోగాళ్లో చేరినట్లుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆలస్యంగా గుర్తించింది. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన 59 మంది పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) లో ఫిర్యాదు నమోదుచేసింది. మోసం, తప్పుడు పత్రాల వినియోగం, ప్రభుత్వ ఉద్యోగాల్లో అక్రమ ప్రవేశం వంటి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
సమగ్ర విచారణ అనంతరం నకిలీ పత్రాలతో ఎంపికైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వారిని సస్పెండ్ చేసే ప్రక్రియ ప్రారంభించామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఇకపై రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పూర్తిస్థాయి ధృవీకరణ జరిపి, ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ స్పష్టం.. సేవలోకి అక్రమ మార్గాల్లో వచ్చిన వారికి చోటు ఉండదు. నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందిన వారిని క్షమించం అని తెలిపారు.


