సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు
▪️ 18న ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు మళ్లింపులు
▪️ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో అమల్లోకి నిబంధనలు
▪️ భారీ వాహనాలకు హోల్డింగ్ పాయింట్లు
▪️ నగర ప్రజలు అవసరం లేకపోతే రోడ్లపైకి రావొద్దు
▪️ హైదరాబాద్–భద్రాచలం రూట్లలో మార్పులు
▪️ ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరి
కాకతీయ, ఖమ్మం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వాహనాలు, లారీలు నగరంలోకి ప్రవేశించకుండా ముందుగానే హోల్డింగ్ పాయింట్లలో నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా నగరంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసర అవసరం ఉంటే తప్ప ప్రజలు వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు
ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే కార్లు, చిన్న వాహనాలు రాజమండ్రి–దేవరపల్లి–జంగారెడ్డిగూడెం–అశ్వరావుపేట–సత్తుపల్లి–భద్రాచలం–కొత్తగూడెం–మణుగూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. కల్లూరు, వైరా సోమవరం గ్రామాల వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి, కోదుమూరు వద్ద దిగి అల్లిపురం–బోనకల్ రోడ్డు మీదుగా ధంసలపురం బ్రిడ్జి వద్ద మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం, కొత్తగూడెం వైపు వెళ్లే కార్లు, చిన్న వాహనాలు పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద దిగి, ప్రకాష్ నగర్–చర్చి కాంపౌండ్–ముస్తఫానగర్–అల్లిపురం మీదుగా కోదుమూరు వద్ద మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే చేరుకోవాలని సూచించారు. సత్తుపల్లి, అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తరువాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ మీదుగా లింగాల చేరుకొని డోర్నకల్–మహబూబాబాద్ మార్గంలో వరంగల్ చేరుకోవాలని తెలిపారు. ఇల్లందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ నుంచి ఎస్ఆర్ గార్డెన్, గోపాలపురం, గొల్లగూడెం మీదుగా లకారం చేరుకొని నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నుంచి ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం వైపు వచ్చే కార్లు, చిన్న వాహనాలు ఎదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్, నాయుడుపేట, గాంధీ చౌక్, చర్చి కాంపౌండ్, ముస్తఫానగర్, అల్లిపురం మీదుగా కోదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు పోలీసులకు సహకరించి, సూచించిన మార్గాలను అనుసరించడం ద్వారా ఇబ్బందులు తప్పించుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.


