మైనార్టీ గురుకులాలకు దరఖాస్తుల ఆహ్వానం
2026–27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక గురుకులాలు
నాణ్యమైన విద్యావకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
అవగాహన కోసం ఆడియో–వీడియో ప్రచారం ప్రారంభం
కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ శుక్రవారం ఐడీఓసి క్యాంప్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలురు, బాలికలకు విడివిడిగా, బూర్గంపాడులో బాలికలకు, భద్రాచలంలో బాలురకు, అశ్వారావుపేటలో బాలికలకు, ఇల్లందులో బాలికలకు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
మైనార్టీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను ఏర్పాటు చేసిందని, వీటిలో ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాలను ప్రతి అర్హుడైన విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. మైనార్టీ గురుకులాలపై అవగాహన పెంచేందుకు విజిలెన్స్ అధికారి కే.సీతారాములు రూపొందించిన ఆడియో, వీడియో పాటలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే.సంజీవరావు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా అడ్మిషన్ల సమాచారం విస్తృతంగా ప్రజలకు చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అభివృద్ధి అధికారి కే.సంజీవరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్‌ఎల్‌సీ ఎం.జే. అరుణకుమారి, విజిలెన్స్ అధికారులు కే.సీతారాములు, ఎం.ఏ.రవూఫ్, మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత గురుకులాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


