వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ
▪️ మొంథా తుపాన్‌తో హనుమకొండలో తీవ్ర నష్టం
▪️ పంటలు, రోడ్లు, ఇళ్లపై సమగ్ర అంచనాలు
▪️ వరద ముంపు గ్రామాల్లో ప్రత్యక్ష పరిశీలన
▪️ రైతులు, బాధితులతో మాట్లాడిన అధికారులు
▪️ నష్టాల ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన
కాకతీయ, హనుమకొండ : అక్టోబర్ నెలలో మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లాలో సంభవించిన వరద ముంపు, పంట నష్టం, రోడ్లు కోతకు గురవ్వడం, ఇండ్లు కూలిపోవడం వంటి విస్తృత నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం శుక్రవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, నష్టాల తీవ్రతపై వివరాలు సేకరించింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి కేంద్ర బృందం ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామాన్ని సందర్శించి, వరద ధాటికి దెబ్బతిన్న ప్రధాన రహదారిని పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో మాట్లాడిన అధికారులు పంటలకు జరిగిన నష్టం, రహదారుల పరిస్థితి, రాకపోకలకు ఏర్పడిన ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు.

పంటలు–రోడ్లకు భారీ దెబ్బ
వరదల కారణంగా పంట పొలాలు ముంపునకు గురైన తీరు, రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితులను కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పంట నష్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శనను కూడా అధికారులు పరిశీలించి, నష్టాల తీవ్రతపై అవగాహన పొందారు. అనంతరం దేవునూరు–ముప్పారం గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జి సమీపంలో వరదల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కూలిన ఇళ్లు… బాధితుల వేదన
ముప్పారం గ్రామంలో భారీ వర్షాల కారణంగా తోట కమలమ్మకు చెందిన ఇల్లు కూలిపోవడంతో ఆ ఇంటిని సందర్శించిన కేంద్ర అధికారులు, బాధిత మహిళతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అలాగే భీమదేవరపల్లి మండలం విశ్వనాథ కాలనీలో వరదలకు దెబ్బతిన్న కాలువను, కొప్పూరులో వర్షాలకు కూలిన ఇంటిని కూడా పరిశీలించారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమకొండ సమ్మయ్య నగర్, గోపాల్‌పూర్ ఊర చెరువు కట్ట, వరద ముంపుకు గురైన అమరావతి నగర్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి కేంద్ర బృందం సందర్శించింది. వరద ముంపుతో పట్టణ ప్రాంతాల్లో ఎదురైన సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, ఆర్ & బి అధికారులు గోపీకృష్ణ, ఉదయ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బృందం సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్రానికి, కేంద్రానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు అధికారులు తెలిపారు.


