పల్లె పండుగలో పశువుల పరేడ్
నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు
గేదెలు, పాడి ఆవులు, కోళ్లు, కుక్కలతో ప్రత్యేక ప్రదర్శనలు
పాడి పరిశ్రమతో గ్రామ ఆర్థిక బలోపేతం : ఎమ్మెల్యే మాధవరెడ్డి
అంతరించిపోతున్న పల్లె సంస్కృతికి పునర్జీవనం : ఎంపీ బలరాం నాయక్
శాంతి సేన రైతు పరపతి సంఘం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
విజేతలకు బహుమతులు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
కాకతీయ, నర్సంపేట టౌన్ : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన పల్లె సంబరాలు కనుల పండువగా సాగాయి. శాంతి సేన రైతు పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువుల అందాల పోటీలు, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా గేదెలు, పాడి ఆవులు, వివిధ జాతులకు చెందిన పశువులు, కోళ్లు, కుక్కలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయగా, పల్లె వాతావరణం ఉట్టిపడేలా కార్యక్రమం సాగింది. పశువుల అందాల పోటీలు చూసిన వారంతా పల్లె సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు.

ఆర్థికాభివృద్ధికి పాడి పరిశ్రమ కీలకం : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల ఆర్థికాభివృద్ధికి పాడి పరిశ్రమ కీలకమని అన్నారు. పాడి ఆవుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి ఉపాధి మార్గాలను గ్రామస్థులు అవలంబించాలని సూచించారు. ప్రతి అవసరాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కాకుండా, పాలు, గుడ్లు, కూరగాయలు, కోళ్లు వంటి వాటిని ఇళ్లలోనే సమకూర్చుకుంటే కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. పశువుల అందాల పోటీలు చూస్తే పల్లె జీవన శైలి కళ్లముందు నిలుస్తోందని పేర్కొన్నారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి సేన రైతు పరపతి సంఘం నిర్వహిస్తున్న ఈ తరహా కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని నిర్వాహకులను అభినందించారు. పల్లె సంస్కృతిని నిలబెట్టే ప్రయత్నాలకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం చివర్లో పశువుల అందాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, శాంతి సేన సంఘ సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని సంక్రాంతి సంబరాలను మరింత ఉత్సాహంగా మలిచారు.



