కవిత వర్సెస్ కేటీఆర్
ముదిరిన రాజకీయ విబేధాలు
చెల్లెలుకు చెక్ పెడుతున్న కేటీఆర్
పార్టీలో ప్రాధాన్యం తగ్గించేందుకు వరుసగా పావులు
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
పదేళ్ల కవిత ప్రస్థానానికి గండి కొట్టిన అన్నయ్య
ఇద్దరి మధ్య సన్నగిల్లిన వ్యక్తిగత అనుబంధం..
ఇటీవల రాఖీకి దూరమే..! ఇద్దరి మధ్య మరింత రాజకీయ దూమారమే..!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల మధ్య నెలకొన్న రాజకీయ విబేధాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీలో ప్రాధాన్యం కల్పించడం లేదంటూ ఎమ్మెల్సీ కవిత అసమ్మతి, నిరసన స్వరాలను బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.పార్టీతో సంబంధం లేకుండా బీసీ నినాదాన్ని ఎత్తుకుని సొంత రాజకీయ వేదిక ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నానని, ఉంటానని, బేధాభిప్రాయాలు ఏ పార్టీలోనైనా ఉండటం సహజమంటూ పలుమార్లు ఆమె మీడియాకు వివరణ కూడా ఇచ్చారు. అయితే బీసీ నినాదం సొంతంగా ఎత్తుకోవడం మొదలు..పార్టీ లైన్‌లో కాకుండా సొంత వ్యాఖ్యనాలు చేయడం, జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటించడంతో పార్టీశ్రేణుల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. నియోజకవర్గాల్లో పర్యటనలకు వస్తున్న కవితకు స్వాగతం పలకాలా..? వద్దా..? అన్న మీమాంసలో శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కొట్టుమిట్టాడింది. కొద్దిరోజుల క్రితం వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకేరోజు పర్యటించారు. కేటీఆర్ పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా, అదే సమయంలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతి నేతలతో కలిసి పర్యటించారు. ఈ సమయంలో కవిత విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి…! ఇంతకు ఆమెను కలవాలా వద్దా..! అన్న క్వశ్చన్ మార్కుతో మాజీ ఎమ్మెల్యేలు కనిపించడం గమనార్హం. కేసీఆర్, కేటీఆర్‌లు కవితను దూరం పెడుతున్నారనే చర్చ క్రమంగా పార్టీ క్యాడర్‌లో పెరిగింది.
కేటీఆర్ క్లారిటీ ఇస్తున్నట్లేనా..?!
పార్టీలో మరో పొలిటికల్ పవర్ సెంటర్‌గా కవిత మారకుండా ఉండేందుకు కేటీఆర్ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించేవిధంగా నిర్ణయాలు ఉంటున్నాయని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తెలంగాణ జాగృతితో పాటు సింగరేణి ఏరియాలో రాజకీయంగా ప్రభావం చూపే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఆమె గతపదేళ్లుగా కొనసాగుతూ వచ్చారు. ఒక దశలో ఈ యూనియన్ ద్వారా ఆమె స్పష్టమైన రాజకీయ శక్తిని చాటుకున్నారు. అయితే తాజాగా ఆమె బీఆర్ ఎస్‌లోనే సొంత వర్గంగా,వేదికను, ఇమేజ్‌ను సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష స్థానాన్ని ఆమె నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించడం వెనుక కేటీఆర్ స్పష్టమైన రాజకీయ లక్ష్యం కనిపిస్తోందన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే టీబీజీకేఎస్‌కు ఇన్చార్జి గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌ను నియమించిన కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో సంఘం కేంద్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా పావులు కదిపారు.
కవిత వర్గంలో ఆక్రోశం..!
పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారని, తనను రాజకీయంగా అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయంటూ కవిత స్వయంగా పలుమార్లు వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనలో ఉండగా ఈశ్వర్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమించారంటూ ఎమ్మెల్సీ కవిత వర్గం నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. పదేళ్ల పాటు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కవితకు మద్దతుగా టీబీజీకేఎస్‌కు పలువురు రాజీనామా కూడా సమర్పించారు. నాయకురాలు రాష్ట్రంలో లేని సమయంలో జరిగిన ఈ నియామకాన్ని ఏం అనుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


