అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
* పశ్చిమ బెంగాల్‌కు చెందిన గ్యాంగ్ పట్టివేత
* రూ.16 లక్షల విలువైన బంగారు–వెండి నగలు స్వాధీనం
* సీసీఎస్–కెయూసీ పోలీసుల సమన్వయ ఆపరేషన్
కాకతీయ, హనుమకొండ : పట్టపగలు ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, కెయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 తులాల బంగారు నగలు, 5.5 తులాల వెండి నగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులు ఫెరోజ్ షేక్, సుక్ చంద్, యామీన్‌లుగా గుర్తించారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా, బేలదంగా తాలూకా, ముజ్‌పార్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు ఫెరోజ్ షేక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
దొంగతనాలే జీవనం..!
మద్యం, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ముఠా పట్టపగలే ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. బంగారు, వెండి నగలను దొంగిలించి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ ఈ ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఆయా రాష్ట్రాల పోలీసుల చేత అరెస్టై జైలు పాలైన చరిత్ర కూడా ఉంది. రెండు నెలల క్రితమే పశ్చిమ బెంగాల్ జైలు నుంచి విడుదలై తెలంగాణలో మళ్లీ దొంగతనాలకు పథకం వేసినట్లు వెల్లడైంది.
హనుమకొండ పరిధిలో 2025 డిసెంబర్ 17న పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో రెండు ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డిసెంబర్ చివర్లో మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. 2026 జనవరి 10న గోపాలపురం, శివసాయి కాలనీలోని ఒక ఇంట్లో తాళం పగలగొట్టి 15 తులాల బంగారం, 5 తులాల వెండి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ సెంట్రల్ జోన్ దారా కవిత పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ కనిపెట్టి కెయూసీ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో పట్టుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు.
పోలీసులకు ప్రశంసలు
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, కెయూసీ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్, ఐటీ కోర్ టీం ఏఏఓ ఎం.డి. సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్సైలు రాజ్‌కుమార్, సాయి ప్రసన్న కుమార్, శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు కె. మహేశ్వర్, వి. జంపయ్య, కానిస్టేబుళ్లు టి. మధుకర్, బి. చంద్రశేఖర్, ఎస్. రాములు, జి. ఉపేందర్, కె. వంశీ, జి. విశ్వేశ్వర్, జి. వినోద్‌లను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.


