కాంట్రాక్టర్లకు జాతర
మేడారంలో అభివృద్ధి పనులపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు
ఒకే కాంట్రాక్టర్ గుప్పిట్లో కీలక పనులన్నీ
ప్రతి జాతరలో పెద్ద మొత్తంలో పెరుగుతున్న ఎస్టిమేషన్లు
అభివృద్ధి పనుల్లో కొరవడుతున్న నాణ్యతా ప్రమాణాలు
ఈసారి కూడా అభివృద్ధి పనుల్లో స్పష్టమైన లోపాలు
హడావుడిగా పూర్తి చేసి.. అంతా తూతూ మంత్రంగా చేసేస్తారా..?
పెదవి విరుస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే తెలంగాణ రాష్ట్ర ఆదివాసీల మహాకుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఇప్పుడు భక్తుల విశ్వాసం కంటే కాంట్రాక్టర్ల లాభాలకే పెద్ద వేదికగా మారుతోందన్న ఆరోపణలు స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రతి సారి వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. కానీ ఆ నిధుల వినియోగంపై ప్రశ్నలు మాత్రం ప్రతి జాతరతో మరింత బలపడుతున్నాయి. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు కొందరు బడ కాంట్రాక్టర్లకు వరంగా మారాయని, అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ప్రతి జాతరలో పనుల అంచనాలు పెంచుతూ కోట్ల రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో చేపట్టే కీలక అభివృద్ధి పనులు ప్రతిసారి ఒకే బడ కాంట్రాక్టర్ చేతికి వెళ్లుతున్నాయని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఏడు కోట్ల రూపాయల అంచనాలు ఉన్న పనుల్లో పెద్ద మొత్తం సదరు కాంట్రాక్టర్ జేబులోకే వెళ్తోందని, జాతర వస్తే చాలు ఎస్టిమేషన్లు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనుల్లో కనీసం 10 శాతం లాభం తనకే దక్కేలా అధికారులతో పావులు కదుపుతున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తులకు అవసరమైన మౌలిక వసతులు సరిగా లేకపోవడం, నాణ్యత లోపించడం పట్ల భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రభుత్వమే చేయలేదా…?
మేడారం జాతరలో అత్యంత కీలకమైన ప్రాంతమైన జంపన్న వాగుపై భక్తుల కోసం స్నాన ఘట్టాలు, తాత్కాలిక నీటి సరఫరా, బట్టలు మార్చుకునే గదులు, ఇసుక చెక్‌డ్యామ్‌లు, మోటర్లు, పైపులు ఏర్పాటు చేయడానికి ప్రతి జాతర కోట్ల రూపాయలను టెండర్ల రూపంలో వెచ్చిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మిషన్ భగీరథ, రూరల్ వాటర్ సప్లై, ఇరిగేషన్ వంటి శాఖలు ఉన్నప్పటికీ ఈ పనులన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లకే అప్పగించడం వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఒకే జాతరకు ఖర్చయ్యే నిధులతో ప్రభుత్వమే మోటర్లు, పైపులు కొనుగోలు చేసి ఆయా శాఖల ఉద్యోగులతోనే పనులు చేపట్టితే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేయవచ్చని వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిసారి ప్రైవేటు కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

పాత వస్తువులకు ప్రతి ఏడాది కొత్త రంగు…
మేడారం జాతర పనుల్లో దాదాపు 10 శాతం కీలక పనులు జంపన్న వాగు పరిసరాల్లోనే జరుగుతున్నాయి. ఈ పనులకు ప్రతిసారి టెండర్లు పిలుస్తున్నప్పటికీ ఒకే వ్యాపారి టెండర్లు దక్కించుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతను గత జాతరలో కొనుగోలు చేసిన మోటర్లు, పైపులు, ఇతర పరికరాలను ప్రతి జాతర సమయంలో మళ్లీ అమర్చడం, జాతర పూర్తయ్యాక అవే పరికరాలను ఊడదీసుకుని తీసుకెళ్లడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. మినీ జాతర, మహాజాతర వచ్చినప్పుడల్లా అదే పాత పరికరాలకు కొత్త రంగు పూసి, కొత్తవని చూపించి కోట్ల రూపాయల బిల్లులు వేస్తున్నాడని భక్తుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఈసారి కూడా అభివృద్ధి పనుల్లో అదే తరహా లోపాలు కనిపిస్తున్నాయని భక్తులు పెదవి విరుస్తున్నారు.
ప్రతిసారి అతనికే ఎందుకు…?
జాతర వస్తే చాలు జంపన్న వాగు పరిసరాల్లో జరిగే కీలక పనులన్నీ అదే బడ కాంట్రాక్టర్‌కు ఎలా దక్కుతున్నాయి? పాత వస్తువులే వాడుతున్నప్పుడు ఖర్చులు ఏటేటా ఎందుకు పెరుగుతున్నాయి? నాణ్యత ప్రమాణాలు ఎందుకు కనిపించడం లేదు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఇచ్చే కమీషన్లకే ఆశపడి అధికారులు ప్రతిసారి అతనికే టెండర్లు కట్టబెడుతున్నారని, దాంతో కోట్ల రూపాయల ప్రజాధనం ప్రైవేటు వ్యాపారి జేబులోకి వెళ్లిపోతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర పనులపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి పారదర్శకత తీసుకురావాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


