భక్తిశ్రద్ధలతో ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
నెక్కొండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
నెల రోజుల నిత్య ఆరాధనకు ఘన ముగింపు
కాకతీయ, నెక్కొండ : నెక్కొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి. గోదాదేవి, రంగనాథుల ఆరాధనతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. చివరి రోజు 30వ పాశురాన్ని అనుసంధానించి భక్తులు భజనలు చేశారు. ఆలయ అర్చకులు బీవీఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో గోత్ర నామార్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల రోజుల పాటు ప్రతి రోజు తిరుప్పావై పఠనం, కుంకుమ పూజలు, ప్రత్యేక అలంకార సేవలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాన్ని అనుసరించిన భక్తులకు లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం సిద్ధించాలని ఆకాంక్షించారు.


