మేడారం మహా జాతర ఆరంభం
మేడారంలో వైభవంగా గుడిమెలిగే పండుగ
మహాజాతర ఆరంభానికి సంకేతంగా శుద్ధి పండుగ
సమ్మక్క–సారలమ్మ గుడుల్లో ప్రత్యేక పూజలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర తొలి ఘట్టం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహాజాతర ఆరంభానికి సంకేతంగా నిర్వహించే గుడి మెలిగే (శుద్ధి పండుగ) కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతరకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టుగా భక్తులు భావిస్తున్నారు. సమ్మక్క గుడిలో కొక్కర కృష్ణయ్య, సిద్ధమైన మునిందర్ పూజారులుగా వ్యవహరించగా, కన్నేపల్లి సారలమ్మ గుడిలో కాక సారయ్య పూజారిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతల మహాజాతర మొదలుకాబోతున్నదనే సంకేతంగా గుడిమెలిగే పండుగను శాస్త్రోక్తంగా నిర్వహించడం మేడారం సంప్రదాయం. తెల్లవారు జామునే పూజారులు లేచి అలుకుపోతలు చేసి, ఇంటిల్లిపాది శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి శుద్ధిగా తయారయ్యారు. అనంతరం గుడి వద్దకు చేరుకుని పాత గుడిపై ఉన్న గడ్డిని తొలగించారు. ఆపై అడవికి వెళ్లి గుట్టగడ్డిని తెచ్చి గుడిపై కప్పారు. ఇది దేవతలకు నూతన ఆహ్వానం పలికినట్లుగా పూజారులు వివరిస్తున్నారు. గుడిలోని పూజా సామాగ్రిని పూర్తిగా శుద్ధి చేసి, రంగురంగుల ముగ్గులతో గుడి ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాలతో మేడారం అరణ్య ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. గుడిమెలిగే పండుగతో మహాజాతర మొదలైనట్టుగా భావిస్తూ భక్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నెల 21న మండె మెలిగే పండుగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు.

అనంతరం నాలుగు రోజుల పాటు మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర–2026 ఘనంగా నిర్వహించనున్నారు.


