మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!
సమస్యలు విన్నవించేందుకు స్థానికుల యత్నం
వింటా..వింటా అంటూనే జనంపై అసహనం
మంత్రి వైఖరిపై అక్కడికక్కడే అసంతృప్తిని వ్యక్తం చేసిన జనం
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మంత్రి వివేక్ వ్యవహారం
కాకతీయ, రామకృష్ణాపూర్ : చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి వివేక్ జనంపై చిరుబుర్రులాడారు. సమస్యలను వినేందుకు వచ్చానని చెబుతూనే.. జనాన్ని ఈసడించుకుంటున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అదే స్థాయిలో జనం నుంచి నిరసన, అసంతృప్తి ఎదురవడంతో మంత్రికి చేదుఅనుభవంగా మిగిలింది. మంగళవారం క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి వివేక్ స్వయంగా పర్యటించారు. మున్సిపాలిటీలో ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంతానికి చెందిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 తో బాధపడుతున్న బాధితులు మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రాన్ని అందించారు. మెగా ఓసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ తో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని వేడుకున్నారు. ఈ సమస్యలు విన్నవించుకునే క్రమంలోనే స్థానికులపై మంత్రి రుసరుస లాడటం గమనార్హం. మీ సమస్యలు వినేందుకేవచ్చా.. వింటాను అంటూనే కొంత అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మంత్రి అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సంబంధిత ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ కు ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంత ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అనంతర వివిధ వార్డులకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా వివిధ వార్డులో పర్యటించిన మంత్రి ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి పనులవై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. తక్షణమే అభివృద్ధి పనులను పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజును ఆదేశించారు.


