నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!
ఎస్సైపై వేటు నిలిపివేయాలని ఎమ్మెల్యే హుకుం..!!
వెనక్కి తగ్గని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం..
ముందు ఎస్సైని వీఆర్ చేస్తూ ఉత్తర్వులు
పొలిటికల్ పైరవీ తర్వాత..సస్పెన్షన్ వేటు
ఇసుక దందాలో వసూళ్లు చేస్తున్నట్లుగా ఎస్సైపై సీపీకి ఫిర్యాదులు
డిపార్ట్‌మెంటల్ ఎంక్వయిరీ తర్వాత చర్యలు
సీపీని తప్పుబడుతూ.. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
ప్రొసిజర్ ఫాలోయినట్లుగా ఉన్నతాధికారులకు వివరణ
సీపీకే సపోర్ట్ చేసిన ఉన్నతాధికారులు..
వ్యక్తిగత పనులపై సెలవులో సీపీ… రాజకీయ ఒత్తిళ్లతో సెలవు పెట్టుకున్నట్లుగా పుకార్లు
వాస్తవానికి గత నెలలోనే సీపీకి సెలవులు ఖరారుచేసిన ఉన్నతాధికారులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఓ ఎస్సైని కరీంనగర్ సీపీ సస్పెన్షన్ చేయడం ఇప్పుడు అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నాడంట. అధికారానంత కవ్వంపెట్టి సీపీ చిలికేశాడన్నట్లుగా సదరు ఎమ్మెల్యే వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. లోయర్ ట్యాంకడ్ బండ్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌పై పోలీస్ కమిషనర్‌కు స్వయంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టారు. విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈ మేరకు సదరు ఎస్సైని ముందుగా కమిషనరేట్‌లో రిజర్వుడ్ చేశారు. అయితే ఈ విషయంలో తనకు తెలియకుండా ఎస్సైపై చర్యలు తీసుకోకవడమేంటి…? అంటూ సదరు ఎమ్మెల్యే సీపీతో పరోక్షంగా వైరం మొదలుపెట్టాడన్న చర్చ ఇప్పుడు పోలీసు వర్గాల్లో జరుగుతోంది. అంతేకాదు…వెంటనే సదరు ఎస్సైని సేమ్‌పోస్టుకు పంపాలని హుకుంకూడా జారీ చేసినట్లుగా తెలిసింది. ఈ విషయంలో సీపీపై డీజీపీకిసైతం ఫిర్యాదు చేసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. అయితే అదేసమయంలో ఎస్సైపై వచ్చిన ఫిర్యాదులు, అధికారులకు సమర్పించిన నివేదికలు.. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా సీపీ సైతం ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..!
కరీంనగర్ జిల్లాకేంద్రానికి అత్యంతసమీపంలోని ఓ ఇసుక క్వారీ నుంచి ఎస్సై వసూళ్లకు పాల్పడినట్లుగా సీపీ గౌస్ ఆలంకు ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా..తనిఖీలు చేపట్టడం, ఓవర్ లోడ్ పేరుతో లారీ డ్రైవర్ల నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా.. ఇలా అనేకానేక ఆరోపణలు అందినట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్సైపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వరీ అనంతరం.. సీపీఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ముందు వీఆర్ చేయడం… ఆ తర్వాత సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కవ్వంపెట్టి..చిలికినట్లు..!
ఎస్సైని కాపాడేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు ఈవిషయాన్ని ఎమ్మెల్యే ,ఆయన అనుచరులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సదరు ఎస్సైని తిరిగి అదే స్టేషన్‌కు ఎస్సైగా తీసుకొచ్చి కూర్చోబెడుతామంటూ సవాళ్లతో కూడిన శపథాలు చేస్తుండటం ఇప్పుడు అటురాజకీయ వర్గాల్లో, ఇటుపోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఒక ఎస్సై కోసం ఎమ్మెల్యే స్థాయి నేత ఎందుకంత పట్టుబడుతున్నాడు అనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో సీపీ గౌస్ ఆలం కూడా వెనక్కితగ్గేపరిస్థితి కనిపించడంలేదు.నిర్ణయాలు నా చేతుల్లో ఉండవు..యాస్ పర్ ప్రొసిజర్ అంటూనే.. డ్యూటీలో నో కాంప్రమైజ్ అంటూ క్లియర్ కట్ డెసిషన్‌ను వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
సీపీలో లీవులో వెళ్తే.. పుకార్లు షికార్లు..!
ముందస్తుగానే ఖరారైన లీవులో సీపీ గౌస్ ఆలం సెలవుల్లో వెళ్లడంపై ఇప్పుడు రాజకీయంగా రంగు పులుముకుంటోంది. ఇప్పుడు ఎస్సైపై చర్యలు తీసుకున్న కొద్ది రోజులకే సీపీ గౌస్ ఆలం..లీవులో వెళ్లడంపై రాజకీయ రంగు పులుముకోవడమే కాదు.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే సీపీ గౌస్ ఆలం లీవులోవెళ్లారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈవిషయంలో కాకతీయకు కూడా అత్యంత విశ్వసనీయ వర్గాలద్వారా స్పష్టమైన సమాచారం అందింది. డిసెంబర్‌లోనే సీపీ సెలవుల షెడ్యూల్ ఖరారుకావడం గమనార్హం. జనవరి 11 నుంచి 18 వరకు ముందే ఉన్నతాధికారుల నుంచి సీపీ అనుమతి తీసుకున్నారు. ఆ మేరకు ఆయనసెలవులోఉన్నారు. అయితే సెలవుకుముందుజరిగిన ఎస్సై సస్పెన్షన్, అధికార పార్టీ ఎమ్మెల్యేతో జరిగిన ఎపిసోడ్.. తర్వాత ఇప్పుడు సీపీపై ఆరోపణలు రావడం గమనార్హం. ఇదంతా ఫేక్ ప్రచారమంటూ పోలీసు వర్గాలు తెలుపుతుండటం గమనార్హం.


