సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు
6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోనే
ఉద్యోగులు కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి చుక్కలు
డీఏ ప్రకటన వెనుక భయం తప్ప భావోద్వేగం లేదు
అమృత్ రూ.104 కోట్లు… సిరిసిల్లలో అభివృద్ధి ఎక్కడ?
14, 15వ ఆర్థిక సంఘ నిధులు వచ్చాయి,. ఫలితం శూన్యం
రెండేళ్ల పాలనలో అభివృద్ధికి పైసా లేదు
అధికారం లేని బీఆర్ఎస్‌కు ఓటేస్తే వృథానే
హైదరాబాద్, కరీంనగర్‌లో బీజేపీ విజయం ఖాయం
మున్సిపల్ పగ్గాలు బీజేపీకే ఇవ్వాలని పిలుపు
కేంద్ర నిధులతో అభివృద్ధి చూపిస్తాం
జెండా ఆవిష్కరణ వేదికగా బండి సంజయ్ ఫైర్ స్పీచ్
సిరిసిల్ల నుంచే మున్సిపల్ పోరుకు బండి సంజయ్ శ్రీకారం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల మాయతో పాలన నడుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆయనకు చుక్కంతైనా చిత్తశుద్ధి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన బండి సంజయ్ శాంతినగర్‌లో బీజేపీ జెండాను ఆవిష్కరించి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరలేపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను మోసం చేయడానికే ప్రభుత్వం ఒక్క డీఏని ఎరగా విసిరిందని మండిపడ్డారు. వాస్తవంగా చూస్తే ఇప్పటికే 5 డీఏలు బకాయిలుగా ఉండగా ఈ నెలతో 6వ డీఏ కూడా పెండింగ్ జాబితాలోకి చేరుతోందన్నారు. 6 డీఏలు చెల్లించలేని స్థితి ఏ ప్రభుత్వానికైనా ఆర్థిక దివాళాకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న నిజానికి బహిరంగ అంగీకారమేనన్నారు. ఉద్యోగులు న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టితే ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్థితి తప్పదని హెచ్చరించారు. చివరకు బకాయిలన్నీ చెల్లించాల్సిందేనన్న భయంతోనే ప్రజలను మభ్యపెట్టే నాటకంగా ఒక్క డీఏ ప్రకటించి తప్పించుకునే ప్రయత్నం చేశారని సంజయ్ ఆరోపించారు.
ఆరు గ్యారంటీలు గాలిలోనే
నిధుల లెక్క చెప్పలేని స్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలుకాలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 ఎక్కడ ? స్కూటీలు ఇచ్చారా ? వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇచ్చారా? నిరుద్యోగులకు రూ.4,000 భృతి అమలయ్యిందా? రెండేళ్ల పాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా? అంటూ వరుస ప్రశ్నలతో కాంగ్రెస్‌ను నిలదీశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీకి ఓట్లు వేయాలా అని ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఓటుకు రూ.5 వేలు పంచడమే కాంగ్రెస్ విధానమని విమర్శించారు. అలాగే పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 14వ, 15వ ఆర్థిక సంఘ నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కోసం రూ.30 కోట్లు, అమృత్ పథకం కింద రూ.104 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ నిధులు ఏమయ్యాయో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా అయినా ఇచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు.
కేంద్రం ఇంత భారీగా నిధులు ఇస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం పైసలిచ్చిందని ఎప్పుడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పారా అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలను వేధించడం అక్రమ అరెస్టులు చేయడం తప్ప వారి పాలనలో సాధించిందేమిటని విమర్శించారు. ఇండ్లు ఇచ్చేది కేంద్రం, అభివృద్ధి నిధులు తెచ్చేది బీజేపీనేనని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలకు లాభమేమిటని సంజయ్ ప్రశ్నించారు.
నిధులు మింగి పట్టణాన్ని ముంచారు, సిరిసిల్లను బీజేపీకి అప్పగించండి.
బండి సంజయ్ పిలుపు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించకపోవడమే సిరిసిల్ల అభివృద్ధి కుంటుపడటానికి కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. వర్షం పడితే సిరిసిల్ల పట్టణమే నీటమునిగే స్థితి ఏర్పడిందని చివరకు కలెక్టరేట్ కూడా వరద నీటిలో మునిగిన దుస్థితిని ప్రజలు కళ్లారా చూశారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చే పైసలకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తే ఐదేళ్లు నరకయాతన తప్పదని హెచ్చరించారు. సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేతలతో చూపిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ గెలిస్తే సిరిసిల్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, మున్సిపాలిటీల్లో అధికారంలో లేకపోయినా బీజేపీ పెద్ద సంఖ్యలో సైకిళ్లు పంపిణీ చేసిందని ప్రభుత్వ ఆసుపత్రులకు కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలు అందించిందని గుర్తు చేశారు. వివిధ మార్గాల్లో ప్రజల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తున్న పార్టీ బీజేపీనేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేస్తే అభివృద్ధి మీ ఇంటి తలుపు తడుతుందని లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుందని అన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అయినా నిధులు తెచ్చే సత్తా బీజేపీకే ఉందని సంజయ్ స్పష్టం చేశారు.
ఫామ్‌హౌజ్ రాజకీయాలతో పార్టీ అంతం.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారానికి దూరంగా ఉన్న భారత రాష్ట్ర సమితికి ఓటేయడం డ్రైనేజీలో ఓటు వేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఒక్క ఎంపీ కూడా లేని పార్టీకి ఓటు వేసి ప్రజలు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అభ్యర్థి దొరకని స్థితికి బీఆర్ఎస్ చేరిందని ఎద్దేవా చేశారు. పార్టీలో ఎమ్మెల్యేలు మిగులుతారో లేదోనన్న అనిశ్చితి నెలకొందని కుటుంబంలోనే ఒక్కో దిక్కుగా రాజకీయాలు సాగుతున్నాయని విమర్శించారు. అధినేత కేసీఆర్ ప్రజల్లో కనిపించకుండా ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ఆసుపత్రి లేదా ఫామ్‌హౌజ్ తప్ప జనంలోకి రావడం లేదని ఆరోపించారు. ఇది బీఆర్ఎస్ రాజకీయ క్షీణతకు స్పష్టమైన సంకేతమని అన్నారు. ఈసారి హైదరాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మేయర్ పీఠాలు, సిరిసిల్ల, వేములవాడ సహా అనేక మున్సిపాలిటీల్లో ఛైర్మన్ స్థానాలు బీజేపీ ఖాతాలోకే వస్తాయని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈసారి నిర్ణయాత్మక తీర్పుతో బీజేపీకి అధికారం కట్టబెడతారని ఆయన స్పష్టం చేశారు.


