యూరియా కృత్రిమ కొరతపై ఏఐకేఎఫ్ ఆందోళన
కాకతీయ, నర్సంపేట : రైతులకు సబ్సిడీ ఎత్తివేసే ఉద్దేశంతోనే యూరియాను కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. సోమవారం వరంగల్ అండర్‌బ్రిడ్జి సమీపంలోని ఓంకార్ భవన్‌లో జరిగిన ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయానికి దారితీసే విధానాలు అవలంబిస్తోందని, నూతన విత్తన చట్టం రైతు వ్యతిరేకమని విమర్శించారు. యూరియా పంపిణీలో ఆన్‌లైన్ యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ సబ్సిడీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారుల ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల రైతులకు సరైన మార్గనిర్దేశం అందడం లేదన్నారు. సన్నధాన్యం రైతులకు బోనస్ చెల్లింపులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై నిరసనగా ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యవసాయ అధికారుల కార్యాలయాల వద్ద ఆందోళనలు, ధర్నాలు చేపట్టాలని ఏఐకేఎఫ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు వి.తుకారాం నాయక్, కుసుంబా బాబురావు, వక్కల కిషన్, ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


