ప్రముఖ నృత్య తార తనుశ్రీ అస్తమయం
కథక్‌లో గిన్నిస్ రికార్డు సాధించిన యువ కళాకారిణి
ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
కాకతీయ, ఖిలావరంగల్ : వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి ఇనుగుల తనుశ్రీ (18) మృతిచెందారు. కథక్ నృత్యంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన తనుశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడంతో పాటు పలు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అందుకుని చిన్న వయసులోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనుశ్రీ మరణ వార్త తెలియగానే పలువురు ప్రముఖులు, కళాకారులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అత్యంత ఆశాజనక కళాకారిణి అకాల మృతి సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


