బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్..
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ రావడమే కాదు.. మెగాటోర్నీ తేదీ కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంకలో 9 వేదికలను ఐసీసీ ఖరారు చేసేసింది. అంతా సవ్యంగా జరుగనుంది అనుకుంటే బంగ్లాదేశ్ బోర్డు.. ‘ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం మా జట్టును ఇండియా పంపించమ’ని తిరకాసు పెట్టింది. దాంతో.. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పావులు కదుపుతోంది. ఐసీసీ అంగీకరిస్తే బంగ్లా మ్యాచ్‌లను తమ దేశంలో ఆడిస్తామని పీసీబీ అంటోంది. ఇటీవల భారత్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య పెరిగిన దూరం ప్రపంచకప్ షెడ్యూల్‌పై పడేలా ఉంది. ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లా బోర్డు ఐసీసీకి ఈమెయిల్ పంపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భద్రతను కారణంగా చూపిన బంగ్లా బోర్డుతో ఐసీసీ ఛైర్మన్ జై షా(Jai Shah) మాట్లాడి ఒప్పిస్తారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను మా దేశంలో ఆడించేందుకు సిద్దమంటూ పాకిస్థాన్ బోర్డు ముందుకొచ్చింది. శ్రీలంకలో మైదానాలు అందుబాటులో లేకుంటే మా స్టేడియాలకు అనుమతివ్వండని పీసీబీ అంటోంది. జియో సూపర్ నివేదిక ప్రకారం.. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల విషయమై పాకిస్థాన్ బోర్డు సంప్రదింపులు జరుపుతోందట. శ్రీలంకలో స్టేడియాలు అందుబాటులో లేని పక్షంలో తమ దేశంలోని మైదానల్లో ఆ జట్టు మ్యాచ్‌లు ఆడించేందుకు పీసీబీ సన్నద్ధంగా ఉందట. ఒకవేళ ఐసీసీ అందుకు అంగీకరిస్తే తక్కువ సమయంలోనే తమ స్టేడియాలను సిద్ధం చేస్తామని పాక్ బోర్డు అంటోంది. మరి.. ఈ వ్యవహారంలో అనవసరంగా తలదూరుస్తున్న పీసీబీపై ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఐసీసీ స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని బీసీబీ అనుకుంటోంది.


