ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
ఆర్థిక వెనకబాటుకు రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి
హనుమకొండ ‘సింహ గర్జన’కు తరలిన తొర్రూరు ఓసి నేతలు
కాకతీయ, తొర్రూరు : ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తొర్రూరు ఓసి జేఏసీ బాధ్యుడు ముద్దం విక్రమ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓసి జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ఓసీల ‘సింహ గర్జన’ భారీ బహిరంగ సభకు ఆదివారం తొర్రూరు మండలంలోని పలు ప్రాంతాల నుంచి ఓసి నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఓసీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరిగానే ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఓపెన్ కేటగిరీలో అన్ని వర్గాలు పోటీ పడటం వల్ల ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. సామాజిక వివక్షత తగ్గినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక వివక్షత కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆర్థిక వెనకబాటును ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు. ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఓసి–ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లకు షరతుల్లేని ఐదేళ్ల గడువు ఇవ్వాలని కోరారు. వయోపరిమితి పెంపు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు టెట్ అర్హత మార్కుల తగ్గింపు వంటి డిమాండ్లను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఫతేపురం సర్పంచ్ ఇట్టె మాధవరెడ్డి సహా పలువురు ఓసి నాయకులు పాల్గొన్నారు.


