కాకతీయ పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది
విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపు
అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వుట్కూరి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : ప్రజాహితమే లక్ష్యంగా, ప్రాంతీయ సమస్యలపై లోతైన విశ్లేషణతో కథనాలను అందిస్తూ కాకతీయ దినపత్రిక పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వుట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. సమాజాన్ని చైతన్యపరచే వార్తలతో కాకతీయ జర్నలిజానికి కొత్త విలువలు జోడిస్తోందని ప్రశంసించారు. కరీంనగర్‌లోని కొత్తపల్లి అల్ఫోర్స్ బాయ్స్ కళాశాల క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను డా. నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యాన్వేషణే లక్ష్యంగా నిబద్ధతతో కూడిన జర్నలిజాన్ని కొనసాగిస్తూ కాకతీయ ప్రజాస్వామ్యానికి బలమైన తోడ్పాటు అందిస్తోందన్నారు.
ప్రజాహితమే కేంద్రబిందువు
విద్య, రైతాంగం, యువత, సామాజిక సమస్యలపై కాకతీయ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయని తెలిపారు. విశ్వసనీయతను ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగుతున్న కాకతీయ ప్రయాణం అభినందనీయమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ జర్నలిజంలోనూ కాకతీయ తనదైన ముద్ర వేస్తోందని ప్రశంసించారు. ప్రాంతీయ సమస్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని, ఆ బాధ్యతను కాకతీయ సమర్థంగా నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి, విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక కరీంనగర్ బ్యూరో ఇంచార్జ్ సాయి కిరణ్, కరీంనగర్ ఆర్సీ వేణు, అల్ఫోర్స్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


