సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!
డీలిమిటేషన్ పేరుతో కుట్ర
కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌ను విడగొట్టే ప్రయత్నంపై 17న నల్లబ్యాడ్జీలతో నిరసన
రైల్‌రోకో, బంద్, ఆమరణ దీక్షకు వెనుకాడం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కాకతీయ, హైదరాబాద్ : డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఏ మాత్రం సహించబోదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్‌ను ముక్కలు చేసే కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నెల 17న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే సికింద్రాబాద్‌లో రైల్‌రోకో, బంద్‌లు, నిరవధిక దీక్షలు నిర్వహిస్తామని, చివరకు ఆమరణ దీక్షకూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
అస్తిత్వంపై దాడి
డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్‌ను విభజించడం అనేది నగర చరిత్రపై, ప్రజల భావోద్వేగాలపై ప్రత్యక్ష దాడేనని తలసాని మండిపడ్డారు. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదని, సికింద్రాబాద్ ప్రాధాన్యతను తగ్గించాలన్న పక్కా కుట్రగా అభివర్ణించారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన తప్పులు, లోపాలతో నిండి ఉందని విమర్శించారు. మేయర్‌కు కూడా తెలియకుండా డివిజన్ల విభజన జరగడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ను బలహీనపరిచే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.


