తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం
దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు
కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’ రాజకీయాలు
మల్కాజ్‌గిరి ఘటన హిందూ విశ్వాసంపై దాడి
హిందువుల తరఫున గట్టిగా మాట్లాడేది బీజేపీయే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు
ఆలయాల రక్షణకు సాంస్కృతిక పోరాటం తప్పదని హెచ్చరిక
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, గౌ రక్షకులపై హింస యాదృచ్ఛిక ఘటనలు కావని, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. హిందూ విశ్వాసాల పరిరక్షణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, గౌ రక్షకులపై హింస పెరుగుతోందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కావని, హిందువుల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. ఇది ఒక సాధారణ పరిస్థితి కాదని, కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెట్టే ప్రమాదకరమైన ‘ప్యాటర్న్’గా అభివర్ణించారు.

మల్కాజ్‌గిరి ఘటన.. హిందూ విశ్వాసానికి అవమానం
గత రాత్రి మల్కాజ్‌గిరిలో చోటుచేసుకున్న ఘటన హిందూ విశ్వాసంపై జరిగిన ఘోరమైన దాడిగా ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన కట్టమైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసి ఆలయాన్ని అపవిత్రం చేయడం అత్యంత ఖండనీయమన్నారు. ఇది చిన్న ఘటన కాదని, హిందూ సమాజాన్ని అవమానపరిచే చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించడం, ప్రధాన మీడియా కూడా స్పందించకపోవడం తీవ్రంగా కలచివేసిందని రాంచందర్ రావు అన్నారు. ఈ మౌనం తెలంగాణలో హిందువులపై ఏం జరిగినా వ్యవస్థ పట్టించుకోదన్న కఠిన నిజాన్ని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.
హిందువుల తరఫున బీజేపీ మాత్రమే పోరాటం
హిందువుల భావోద్వేగాలకు, విశ్వాసాలకు, ఆధ్యాత్మికతకు నేటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గౌరవం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. నేటి కాంగ్రెస్ పార్టీ ఆత్మలోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ ముస్లిం లీగ్–మావోయిస్టు సానుకూల కాంగ్రెస్‌గా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం పట్ల ఇతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యాయని, స్పష్టంగా, ధైర్యంగా హిందువుల తరఫున గొంతెత్తేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ మౌన ప్రేక్షకులుగా ఉండబోదని, హిందూ విశ్వాసంపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని రాంచందర్ రావు హెచ్చరించారు. ఆలయాల రక్షణ కోసం, హిందువుల గౌరవ పరిరక్షణ కోసం, గౌమాత రక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని ప్రకటించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పోరాటం కాదని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం సాగించే సాంస్కృతిక పోరాటమని ఆయన స్పష్టం చేశారు.


