పేదల బియ్యం గల్లంతు
కరీంనగర్ జిల్లాలో భారీ సీఏంఆర్ స్కామ్
35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్
ప్రభుత్వానికి రూ.124 కోట్లకుపైగా నష్టం
ఏళ్లుగా డిఫాల్టర్లపై చర్యలే లేవు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం భారీగా మాయం కావడం తీవ్ర సంచలనంగా మారింది. సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) పేరుతో ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం ఏళ్ల తరబడి మిల్లుల వద్దే నిలిచిపోవడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల ప్రకారం వేల మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదవుతున్నా, సంబంధిత మిల్లులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం, అండదండలే కారణమన్న విమర్శలు బలపడుతున్నాయి. పేదల కడుపు నింపాల్సిన బియ్యం దారి మళ్లుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
2012 నుంచే మొదలైన బకాయిలు
కరీంనగర్ జిల్లా రేషన్ వ్యవస్థలో సీఏంఆర్ డిఫాల్ట్ సమస్య కొత్తది కాదని అధికారిక రికార్డులే చెబుతున్నాయి. 2012–13 ఖరీఫ్ నుంచే బకాయిలు మొదలై 2024 వరకు కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 ఖరీఫ్‌లో 2,589.866 మెట్రిక్ టన్నులు, 2013–14 రబీ సీజన్‌లో 35.316 మెట్రిక్ టన్నులు, 2014–15 ఖరీఫ్‌లో 178.782 మెట్రిక్ టన్నులు డిఫాల్ట్‌గా నమోదయ్యాయి.
తర్వాత కొంత విరామం అనంతరం 2021–22 ఖరీఫ్‌లో 4,106.105 మెట్రిక్ టన్నులు, 2022–23 రబీ సీజన్‌లో ఏకంగా 20,115.377 మెట్రిక్ టన్నులు, 2023–24 ఖరీఫ్‌లో మరో 8,507.130 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.
19 మిల్లులు.. 22 డిఫాల్ట్ ఎంట్రీలు
జిల్లాలో మొత్తం 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా నమోదైనట్లు అధికారిక జాబితా చెబుతోంది. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకున్నట్లు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 22 డిఫాల్ట్ ఎంట్రీలతో ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ బియ్యం 35,563.576 మెట్రిక్ టన్నులుగా తేలింది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.137 కోట్లుగా ఉండగా, కనీసం రూ.124 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క జిల్లాలోనే ఇంత భారీ మొత్తంలో బియ్యం గల్లంతు కావడం రేషన్ వ్యవస్థ పర్యవేక్షణపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది.
నామమాత్రపు కేసులకే పరిమితమైన చర్యలు
ఇంత భారీ స్థాయిలో డిఫాల్ట్‌లు నమోదవుతున్నా అధికారుల చర్యలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లులపై రికవరీ చర్యలు, లైసెన్సుల రద్దు, కఠిన శిక్షలు వంటి చర్యలు ఎక్కడా కనిపించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నామమాత్రపు కేసులు నమోదు చేసి వ్యవహారాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోతున్నా బాధ్యత వహించాల్సిన శాఖలు మౌనంగా ఉండటం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే రేషన్ వ్యవస్థలో డిఫాల్ట్‌లు మరింత పెరిగే ప్రమాదం ఉందని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


