ఎస్సారెస్పీ కట్టపై కబ్జాల కలకలం
ముగ్గుపోసి పిల్లర్ల నిర్మాణానికి యత్నం
సిబ్బంది రంగప్రవేశంతో నిలిచిన అక్రమ పనులు
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో ఎస్సారెస్పీ కాలువ కట్ట భూముల ఆక్రమణలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన కాలువ కట్ట భూములను కొందరు అక్రమార్కులు బహిరంగంగానే కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. శనివారం కాలువ కట్టపై ఇండ్ల నిర్మాణానికి ముందస్తుగా ముగ్గులు పోసి, పిల్లర్ల కోసం రంధ్రాలు తవ్విన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా ఎస్సారెస్పీ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పత్రికల్లో పలుమార్లు కథనాలు వచ్చినప్పటికీ అక్రమాలు మాత్రం ఆగడం లేదన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అధికారుల అండతోనేనా?
ఇప్పటివరకు చాటుమాటుగా సాగిన కబ్జాలు తాజాగా బహిరంగంగానే జరగడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సారెస్పీ పరిధిలోని నీటిపారుదల శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే అధికారుల అండదండలతోనే ఇలాంటి ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. కాలువ భూములు ప్రజా ఆస్తులని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఎస్సారెస్పీ కట్ట భూముల ఆక్రమణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


